రైతు కూలీల హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య
బోధన్ రూరల్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి).
కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు, వ్యవసాయ కూలీల నిజ ఆదాయాలు తగ్గిపోతున్నాయని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ఆరోపించారు. శుక్రవారం బోధన్ మండలం పెద్ద మావంది గ్రామంలో నిర్వహించిన అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) బోధన్ డివిజన్ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
మహాసభ ప్రారంభంలో బోధన్ మండల అధ్యక్షుడు ఎల్. చిన్న పర్వయ్య సుత్తి, కొడవలి గుర్తుతో ఉన్న ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం మండల కార్యదర్శి జి. నడిపి భూమయ్య అమరవీరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ ఆచరణలో కనిపించడం లేదని విమర్శించారు. రైతుల హక్కులు, రాష్ట్రాల హక్కులపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ ప్రైవేటీకరణ, చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల విధానం వంటి చర్యలు రైతులు, పేదలపై భారాన్ని పెంచుతున్నాయని అన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధానాలను వ్యతిరేకిస్తున్నామని, గ్రామీణ పేదలకు ఉపాధి హక్కును కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విత్తన రంగంలో కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.గ్రామీణ పేదలు, దళితుల భూమి హక్కులు, నీటి వనరులపై హక్కులు, చేపల వేట, ఇసుక తవ్వకాల హక్కులు, ఆదివాసీల అటవీ హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్, గనుల తవ్వకాలు, భారీ డేటా సెంటర్ల పేరుతో పర్యావరణానికి నష్టం కలిగించే చర్యలను అడ్డుకోవాలని కోరారు.
ప్రజలను విభజించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని, పేదలు, దళితులు, మహిళల హక్కుల పరిరక్షణకు ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమంలో రైతు కూలీ సంఘం కీలకంగా పోరాడిందని తెలిపారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. రైతు కూలీల సమస్యల పరిష్కారంపై పాలకులకు చిత్తశుద్ధి లేదని, వారి హక్కుల కోసం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ మహాసభలో జిల్లా నాయకులు పిరోళ్ల పోశెట్టి, సూర్య, విఠల్, ఎస్.కె. రషీద్, గుండన్న, మొయిన్, పులి లక్ష్మి, జయరాం, లక్ష్మణ్, గణపతి, చిన్న గంగారం, లక్ష్మి, ప్రవీణ్, సుధాకర్, డి. పోశెట్టి, గౌతం, శివ తదితరులతో పాటు సుమారు 50 మంది రైతు కూలీలు పాల్గొన్నారు.

