Breaking News

సాగునీటి గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు

విజన్‌తో పనిచేస్తున్న సీఎం చంద్రబాబు
రూ.20 కోట్లతో పెనుకొండ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు

పెనుకొండ, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి)

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌తో రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11వ వార్డుల్లో మంత్రి సవిత పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు

పెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. 10, 11వ వార్డుల్లో ఇప్పటికే సుమారు రూ.40 లక్షల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో రూ.60 లక్షలతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మొత్తంగా మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం తదితర మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామ కంఠంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇంటి పొజిషన్ పత్రాలను మంత్రి సవిత వారి ఇళ్ల వద్దే అందజేశారు.

సాగునీటిపై జగన్ వ్యాఖ్యలకు మంత్రి సవిత కౌంటర్

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలను మంత్రి సవిత తప్పుబట్టారు. సాగునీటి గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.వర్షాభావం, ఎల్‌నినో వంటి పరిస్థితులను ఎదుర్కొంటూ రైతులకు నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల, వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం వంటి చర్యలు చేపట్టామని, హంద్రీ–నీవా పనులను కూడా వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

నాగులకట్ట అభివృద్ధికి రూ.లక్ష

పెనుకొండలోని శ్రీరాములయ్య కాలనీలో నాగులకట్ట అభివృద్ధి కోసం మంత్రి సవిత తన సొంత నిధుల నుంచి రూ.లక్ష కేటాయించారు. ఈ సందర్భంగా స్థానికులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ పెనుకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మంత్రి సవిత అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *