Breaking News

వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

పుట్టపర్తి, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి)

వీఆర్ఏల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఈఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మూడో రోజు పుట్టపర్తి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు.

రాష్ట్రంలోని వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలని కోరారు. అర్హులైన వీఆర్ఏలందరికీ ప్రమోషన్లు కల్పించాలని, విధి నిర్వహణలో మృతి చెందిన వీఆర్ఏల కుటుంబాల్లో అర్హులకు వయోపరిమితితో సంబంధం లేకుండా కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యలను గత రెండేళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమన్నారు. ఆగస్టు 19న ఏపీ వీఆర్ఏల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చలో సీసీఎల్ఏ కార్యాలయం కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 16 నుంచి సహాయ నిరాకరణ కార్యక్రమం చేపడతామని ఉన్నతాధికారులకు తెలియజేశామని తెలిపారు.

అందులో భాగంగా సెప్టెంబర్ 16 నుంచి రాష్ట్రంలోని ప్రతి ఎమ్మార్వో కార్యాలయం వద్ద దీక్షా శిబిరాలు నిర్వహించాలని ఏపీ వీఆర్ఏల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వెంకటేష్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల నాయకులు మహేష్, చిన్న ఓబులప్ప, నరసింహ, పోతులయ్య, షమీతాజ్, వెంకటలక్ష్మి, సోము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *