పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి గుణపాఠం
ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా ఇదే గుణపాఠం తప్పదు: వేముల ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి)
దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి, అదే పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు కీలక పరిణామమని ఆయన పేర్కొన్నారు.దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టిందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించినట్లు పేర్కొన్నారు.
ప్రజలు ఒక పార్టీ గుర్తుపై ఓటు వేసి గెలిపించిన తర్వాత, ప్రజా తీర్పును పక్కనపెట్టి పార్టీ మారడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే చర్య అని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆరోపించిన ఆయన.. హైకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయింపుల విషయంలో చట్టం, రాజ్యాంగ నిబంధనల ప్రాధాన్యత మరోసారి స్పష్టమైందన్నారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఈ తీర్పు ఒక గుణపాఠమని, పార్టీ మారి ప్రజల తీర్పును అవమానించిన వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలని వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. ఇకనైనా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మానుకుని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“సత్యమేవ జయతే.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోంది” అని వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

