సొంత ఖర్చులతో అన్నదానం నిర్వహించిన సర్పంచ్ అశోక్ పటేల్
మద్నూర్, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలోని యువసేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ జాంషెట్‌వార్ తన సొంత ఖర్చులతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
శుక్రవారం గ్రామ సంత (అంగడి) ఉండటంతో అన్నదాన కార్యక్రమానికి గ్రామస్థులు, యువకులు, సంతకు వచ్చిన ప్రజలు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా గణేష్ మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు.అన్నదాన కార్యక్రమంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలతో పాటు పాయసం ఏర్పాటు చేశారు. భక్తులు, వాహనదారులు సైతం గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
ఎస్‌ఐకి సన్మానం
మద్నూర్ ఎస్‌ఐ మోహన్‌రెడ్డి గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ పటేల్ ఎస్‌ఐ మోహన్‌రెడ్డిని శాలువాతో సన్మానించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు.సర్పంచ్ అశోక్ పటేల్ సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడంపై గణేష్ మండలి సభ్యులు, గ్రామస్థులు, సంతకు వచ్చిన ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా కొనసాగింది.



