నిజామాబాద్ స్టార్ హెల్త్ ఆరోగ్య సేవా కేంద్రానికి విశేష స్పందన
నిజామాబాద్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి).
స్థానిక ప్రజలకు ఉచిత ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించేందుకు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ప్రగతి నగర్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య సేవా కేంద్రానికి విశేష స్పందన లభిస్తోంది. కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 3,800 మందికి పైగా ప్రజలు సేవలను వినియోగించుకున్నారు. రోజుకు సగటున 15 మందికి పైగా కేంద్రాన్ని సందర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.వేణు మాల్ సమీపంలోని ప్రగతి నగర్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఎంబీబీఎస్ వైద్యుల ఉచిత కన్సల్టేషన్తో పాటు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, ల్యాబొరేటరీ టెస్టులు, ఔషధాలు, ఆరోగ్య కౌన్సెలింగ్, టీకాలపరమైన సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
మధుమేహం, హైపర్‌టెన్షన్‌పై ప్రత్యేక దృష్టి
కేంద్రాన్ని తరచుగా సందర్శిస్తున్న వారిలో 40 నుంచి 80 ఏళ్ల వయస్సు వారు అధికంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హైపర్‌టెన్షన్, మధుమేహం, జ్వరం తదితర సాధారణ ఆరోగ్య సమస్యలకు ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారని వెల్లడించారు.
ఇప్పటివరకు 1,900 మందికి పైగా మధుమేహ స్క్రీనింగ్, 2,700 మందికి పైగా హైపర్‌టెన్షన్ స్క్రీనింగ్ నిర్వహించారు. అలాగే 1,900 మందికి పైగా ల్యాబొరేటరీ సేవలను వినియోగించుకోగా, 2,600కు పైగా ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. కేంద్రం ద్వారా 3,300కు పైగా ఫార్మసీ సేవలు అందించగా, అర్హులైన వారికి 150కుపైగా న్యూమోకాకల్ టీకాలు అందించినట్లు తెలిపారు.కేంద్రంలో హెమోగ్లోబిన్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, మూత్రంలో షుగర్, అల్బుమిన్ పరీక్షలతో పాటు మలేరియా ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి.
తొమ్మిది రాష్ట్రాల్లో 32 ఆరోగ్య సేవా కేంద్రాలు
స్టార్ హెల్త్ సంస్థ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణలో నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో నాలుగు ఆరోగ్య సేవా కేంద్రాలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో 32 ఆరోగ్య సేవా కేంద్రాల ద్వారా 1.5 లక్షల మందికి పైగా ప్రజలకు సేవలు అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
స్థానికంగా ప్రాథమిక, నివారణాత్మక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని స్టార్ హెల్త్ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ కేబీబీ తెలిపారు. ప్రజలు తమ నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉచిత వైద్య సలహాలు, స్క్రీనింగ్‌లు, డయాగ్నస్టిక్ పరీక్షలు, ఔషధాలు పొందేలా ఈ కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.స్టార్ హెల్త్ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా పిరమల్ ఫౌండేషన్‌కు చెందిన పిరమల్ స్వాస్థ్య భాగస్వామ్యంతో ఈ ఆరోగ్య సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో స్టార్ హెల్త్ బిజినెస్ హెడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ శ్రీనివాస్ కేబీబీ, తెలంగాణ రీజినల్ హెడ్ సురేష్, ఆరోగ్య సేవా కేంద్రం వైద్యులు డాక్టర్ సాయి చరణ్, పీఆర్ఓ తేజస్వి బండారి తదితరులు పాల్గొన్నారు.




