చిన్నారుల పోషకాహార ఉత్పత్తులలో (Infant Nutrition Products) ఆహార భద్రతా ప్రమాణాలు, నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై ప్రముఖ బహుళజాతి సంస్థ ‘నెస్లే ఇండియా లిమిటెడ్’ (Nestle India Ltd) పై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) చట్టపరమైన చర్యలు చేపట్టింది. నెస్లేకు చెందిన మూడు ప్రముఖ ఉత్పత్తులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ వేర్వేరుగా మూడు అడ్జుడికేషన్ (విచారణ) కేసులను నమోదు చేసింది.
కేసు నమోదుకు దారితీసిన ప్రధాన కారణాలు:
- ప్రచార నిబంధనల ఉల్లంఘన (Promotional Claims): ఈ-కామర్స్ వేదికలపై లభించే NAN Excella Pro Stage 1 ఉత్పత్తులపై “5HMOs”, “Whey Protein” అని, అలాగే Lactogen Pro 1 పై వే ప్రోటీన్ “జీర్ణక్రియకు సులభం” (Easy to digest) అని ప్రకటనలు ఇవ్వడాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తప్పుబట్టింది.
- చట్టపరమైన నిషేధం: ‘ఇన్ఫాంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ యాక్ట్, 1992’ మరియు ‘FSSAI 2020 నిబంధనల’ ప్రకారం పసిపిల్లల ఆహార పదార్థాల విక్రయాలను పెంచుకునేలా ఎలాంటి ప్రచారాలు, వాణిజ్య ప్రకటనలు చేయకూడదు.
- నాణ్యతా లోపాలు: నెస్లే తయారీకి చెందిన ఒక ఫాలో-అప్ ఫార్ములా శాంపిల్‌ను ల్యాబ్‌లో పరీక్షించగా అందులో ‘బయోటిన్’ (Biotin) పరిమాణం నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా (Sub-standard) ఉన్నట్లు ప్రాథమిక మరియు రీ-పాజిటివ్ ల్యాబ్ రిపోర్టుల్లో తేలింది.
స్టాక్ మార్కెట్‌పై ప్రభావం: ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టపరమైన చర్యలు ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లో నెస్లే ఇండియా షేరు విలువ దాదాపు 2 శాతం పడిపోయి రూ. 1,345.45 వద్ద ట్రేడ్ అయింది.

