హిందూపురం క్రీడా సంస్కృతికి నిలయం
అనంతపురం, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి)
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణతో పాటు ప్రోత్సాహం అందించేందుకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో క్రికెట్ ఎంపికలు నిర్వహించారు.
ఈ సందర్భంగా RDT క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు ఉన్నారని, వారిని గుర్తించి ప్రోత్సహించాలనే లక్ష్యంతో టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. యువ క్రికెటర్లకు ఈ కార్యక్రమం మంచి అవకాశమని, అందుబాటులో ఉన్న వనరులు, శిక్షణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతపురం ప్రాంతంలో శిక్షణ శిబిరాలు, మ్యాచ్‌లు నిర్వహిస్తూ గ్రామీణ యువ క్రీడాకారుల నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు RDT కృషి చేస్తోందన్నారు.హిందూపురం క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బి.ఎస్. విద్యాసాగర్ మాట్లాడుతూ.. హిందూపురం ప్రాంతానికి ఎంతోకాలంగా గొప్ప క్రీడా సంస్కృతి ఉందన్నారు. యువ క్రీడాకారులు హైస్కూల్ స్థాయి నుంచే అందుబాటులో ఉన్న క్రీడా మైదానాలు, సదుపాయాలను వినియోగించుకుని తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో క్రీడల అభివృద్ధికి RDT చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ మంచి వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. హిందూపురంలో గతంలో అంతర్రాష్ట్ర క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించామని, 1961, 1989 సంవత్సరాల్లో జరిగిన మ్యాచ్‌లలో రాహుల్ ద్రావిడ్, ఆశిష్ కపూర్ వంటి ప్రముఖ క్రికెటర్లు పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు.హిందూపురంలో నిర్వహించిన ఎంపిక కార్యక్రమంలో మొత్తం 86 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో హిందూపురం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దీపక్, బీసీసీఐ అంపైర్ అన్సర్ ఖాన్, RDT APC జయచంద్రారెడ్డి, సీనియర్ క్రీడాకారులు బాబ్జీ, భాస్కర్, సెలెక్టర్లు సి. వెంకటేష్, యోగానంద, విజయ్ రాజు, RDT కోఆర్డినేటర్ ప్రవీణ్, కోచ్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల యువ క్రికెటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రదర్శించి, క్రికెట్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.




