ఎడపల్లి, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ ఐఏఎస్ సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. పీహెచ్సీలో ప్రజలకు అందుతున్న ఓపీ, ఐపీ సేవలు, సిబ్బంది పనితీరు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఫార్మసీ డిస్పెన్సింగ్ రూమ్, ప్రధాన మందుల స్టోర్‌ను పరిశీలించిన ఆయన మందుల నిల్వలు, గడువు తేదీలను తనిఖీ చేశారు. గడువు ముగియనున్న మందులను ముందుగానే గుర్తించి, వాటి వినియోగ గడువు తేదీలను స్పష్టంగా సూచించాలని ఫార్మసిస్టును ఆదేశించారు.అనంతరం ఓపీ రూమ్, ఐపీ వార్డులు, ల్యాబ్, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, వాష్‌రూమ్‌లను పరిశీలించారు. ఆపరేషన్ రిజిస్టర్, హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. పీహెచ్సీ సూపర్వైజర్లు, సిబ్బందితో మాట్లాడి వారి విధులు, ఇంటి సందర్శనలు, ఏఎన్సీ, పీఎన్సీ ఫోన్ కాల్స్, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు సేకరించారు.
రోగులతో నేరుగా మాట్లాడి పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పీహెచ్సీ పరిధిలో ఆశా కార్యకర్తల పనితీరు, విధుల సమయాలు, హాజరు రిజిస్టర్ల నిర్వహణపై కూడా ఆరా తీశారు.అలాగే ఎన్సీడీ సేవలు, జ్వర సర్వే, గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు, ఎల్ఎంపీ వివరాలు, అర్హత కలిగిన జంటలు, ప్రస్తుతం ఉన్న ఏఎన్సీ, పీఎన్సీ కేసుల సంఖ్య తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ సూచించారు.

