ప్రతీకారంతోనే హత్యకు పథకం.. కత్తితో దాడి చేసిన గంధం సంతోష్
టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు
హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, మరో రెండు కత్తులు, రెండు కర్రలు స్వాధీనం
నిజామాబాద్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: శివ ఠాకూర్)
నిజామాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన చిత్తారి హరిబాబు హత్య కేసులో ప్రధాన నిందితుడు (A-1) గంధం సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన సుమారు ఒకటిన్నర రోజులోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ తెలిపారు.
చిత్తారి హరిబాబు హత్యకు సంబంధించి ఆయన తల్లి చిత్తారి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 17న నిజామాబాద్ II టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్ 169/2026గా BNS సెక్షన్ 103(1) r/w 3(5) కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయిన వెంటనే పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే..
ఈ ఏడాది మార్చి 17న హరిబాబు భార్య గంధం వైష్ణవి హత్యకు గురైన కేసులో హరిబాబు, అతని తల్లి చిత్తారి లక్ష్మి, అతని ఇద్దరు సోదరులు అరెస్టై కరీంనగర్ జైలుకు వెళ్లి అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం వైష్ణవి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన హరిబాబు, అతని తల్లి నిజామాబాద్‌కు వచ్చి సాయినగర్‌లో నివసిస్తూ ఆర్.ఆర్. చౌరస్తా సమీపంలో మొక్కజొన్న కంకులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.వైష్ణవి హత్యను మనసులో పెట్టుకుని ప్రతీకార భావంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం గంధం సంతోష్ తన తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్ తదితరుల సహకారంతో హరిబాబుపై దాడికి వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
కారులో వచ్చి కత్తితో దాడి
ఈ నెల 17న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో కోరుట్ల నుంచి తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారులో నిందితులు నిజామాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్.ఆర్. చౌరస్తా సమీపంలోని గిరిరాజ్ కాంప్లెక్స్ ఎదుట పానీపూరి బండి వద్ద హరిబాబు నీరు తీసుకుంటున్న సమయంలో కారులోని వెనుక వైపు నుంచి దిగిన గంధం సంతోష్ కత్తితో హరిబాబు తల, ముఖం, మెడపై పలుమార్లు దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాల ద్వారా నిర్ధారణ అయినట్లు పోలీసులు వెల్లడించారు.
దాడి అనంతరం అదే కారులో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.
రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా పట్టివేత
నిందితుల కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. నమ్మకమైన సమాచారం మేరకు నిజామాబాద్ ఔటర్ బైపాస్ ప్రాంతంలో గంధం సంతోష్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులను తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని అదుపులోకి తీసుకున్నారు.కారు అక్కడే వదిలి తన అత్తగారి ఊరు విశాఖపట్నం వెళ్లేందుకు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో సంతోష్ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.
ఆయుధాలు, కారు స్వాధీనం
నిందితుడి విచారణలో లభించిన సమాచారంతో హత్యకు ఉపయోగించిన కత్తి, తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారు, కారులో ఉన్న మరో రెండు కత్తులు, రెండు కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రాథమికంగా నలుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో మిగిలిన నిందితుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
పోలీస్ సిబ్బందికి కమిషనర్ అభినందనలు
హత్య జరిగిన ఒకటిన్నర రోజులోనే ప్రధాన నిందితుడిని అరెస్టు చేయడంపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్, ఏసీపీ ప్రకాష్, సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్ఐ యాదగిరి గౌడ్‌తో పాటు పోలీస్ సిబ్బందిని అభినందించారు. కేసులో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులకు కోర్టులో శిక్ష పడేలా పకడ్బందీగా ఆధారాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.



