Breaking News

జూరాల ప్రాజెక్ట్ ముట్టడి ఉద్రిక్తం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అరెస్ట్!

వనపర్తి/మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ‘జూరాల ప్రాజెక్ట్ ముట్టడి’ పిలుపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీ ఎత్తున రంగంలోకి దిగి బీఆర్‌ఎస్ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తుగా నిర్బంధిస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని వనపర్తిలోని ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం (హౌస్ అరెస్ట్) చేశారు.

ముట్టడి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఇంటెలిజెన్స్ బలగాలను మోహరించి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల దిగ్బంధంతో జూరాల ఆనకట్ట పరిసరాలు మరియు క్షేత్రస్థాయి ప్రాంతాలు పూర్తిగా పోలీసు బలగాలతో నిండిపోయాయి. వనపర్తి, ఆత్మకూరు, అమరచింత, నర్వ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రాజెక్టు వైపు రాకుండా రహదారుల వెంట తీవ్రంగా వాహన తనిఖీలు చేపట్టారు.

మరోవైపు, కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గద్వాలలో అఖిలపక్షం, రైతు సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడి నాయకులను కూడా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్ ముట్టడి పిలుపు, పోలీసుల కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ జూరాల ప్రాజెక్ట్ సమీపంలో తీవ్ర ఉత్కంఠ, హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *