Breaking News

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు

రూ.15 వేల లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ పట్టివేత

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కూడా అదుపులోకి

నిజామాబాద్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: శివ ఠాకూర్).

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. రూ.15 వేల లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. అతనితో పాటు అదే విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న మరో వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తన పనికి సంబంధించి అనుమతి కోసం ఓ వ్యక్తి మున్సిపల్ కార్యాలయాన్ని ఆశ్రయించగా, సంబంధిత విభాగంలో లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు.ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయంలోని రెండో అంతస్తులో ఉన్న ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ అశోక్ కుమార్ బాధితుడి నుంచి రూ.15 వేల నగదు తీసుకుంటుండగా, ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు వెల్లడించారు. అదే విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఘటనకు సంబంధించిన వివరాలను బాధితుడి నుంచి అధికారులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *