Breaking News

వినాయక మండపం వద్ద చికెన్ ముక్కలు: సైదాబాద్‌లో ముగ్గురు అరెస్ట్!

హైదరాబాద్ (మదన్నాపేట్): పాతబస్తీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్నాపేట్‌లో వినాయక మండపం వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ ప్రాంతం మరియు సమీపంలోని దేవాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు చికెన్ ముక్కలు, వ్యర్థాలను పడేయడంతో స్థానికులు, హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషయం తెలిసిన వెంటనే బీజేపీ నాయకులు, వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకుని నిరసన చేపట్టడంతో ప్రాంతంలో రసాభాస నెలకొంది. ఈ విధమైన ఘటనలు పండుగల సమయంలో పదేపదే జరుగుతున్నాయని, నిందితులను మానసిక వికలాంగులుగా చిత్రీకరించి పోలీసులు వదిలేస్తున్నారని ఉత్సవ నిర్వాహకులు ఆరోపించారు.

పోలీసుల రంగప్రవేశం – ముగ్గురు ముందస్తు అదుపులోకి: ఘటనా స్థలానికి చేరుకున్న మదన్నాపేట్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సమీపంలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి చెందిన స్థానికులే ఈ వ్యర్థాలను ప్యాకెట్‌లో వేసి పడేసి ఉంటారని స్థానికులు ఆరోపించారు. దీంతో విచారణ చేపట్టిన మదన్నాపేట్ పోలీసులు.. ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్న ఇమ్రాన్ ఖురేషీ, సమీనా మరియు అర్షియా అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

సాయంత్రానికి పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చిందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని లోతైన విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *