Breaking News

బినామీల ఇళ్లపై ఏసీబీ దాడి.. భీమ్‌రెడ్డి నెట్‌వర్క్ వెనుక ఉన్నదెవరు?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్టయిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యవహారంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు తీవ్రరూపం దాల్చింది. భీమ్‌రెడ్డి బినామీలే లక్ష్యంగా ఏసీబీ అధికారులు హైదరాబాద్, జహీరాబాద్‌లలోని మొత్తం 10 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ. 400 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బిల్డర్ ఇంట్లో రూ. 1.35 కోట్ల నగదు, విదేశీ మద్యం స్వాధీనం: పుప్పాలగూడలోని రియల్ ఎస్టేట్ బిల్డర్ వీరబొమ్మ వెంకటేష్ ఇంట్లో జరిపిన సోదాల్లో ఏసీబీ బృందాలు రూ. 1.35 కోట్ల నగదు, భారీగా విదేశీ కరెన్సీ, 14 విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నాయి. గతంలో టోలిచౌకిలో సాధారణ బియ్యం వ్యాపారం చేసిన వెంకటేష్, భీమ్‌రెడ్డితో పరిచయం తర్వాత నిర్మాణ రంగంలో కోటీశ్వరుడిగా ఎదిగిన తీరుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. భీమ్‌రెడ్డి అక్రమ సంపాదనను వెంకటేష్ నిర్మాణ రంగంలో పెట్టుబడిగా పెట్టారనే బలమైన అనుమానంతో విచారణ జరుపుతున్నారు.

మాజీ హోంగార్డు, ఆడిటర్ ఇళ్లల్లో రికార్డుల సీజ్: పటాన్‌చెరులో భీమ్‌రెడ్డి వద్ద పనిచేసిన మాజీ హోంగార్డు లక్ష్మణ్ నాయక్ జహీరాబాద్‌లోని ఇల్లు, కార్యాలయాలపై దాడులు చేసిన అధికారులు పలు ఆస్తుల పత్రాలను సీజ్ చేశారు. హోంగార్డు ఉద్యోగం వదిలేసిన లక్ష్మణ్ స్వల్పకాలంలోనే బంగారు నగల దుకాణం ఏర్పాటు చేసి ధనవంతుడిగా మారినట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో పాటు భీమ్‌రెడ్డి ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే ఆడిటర్ కార్యాలయం నుంచి కీలకమైన డిజిటల్ ఆధారాలను రికవరీ చేశారు.

ఏసీబీ రాకతో పరారైన విల్లా విక్రేత: ఇబ్రహీంబాగ్‌లో భీమ్‌రెడ్డికి విల్లా విక్రయించిన మాధవరావు అనే వ్యక్తి ఏసీబీ అధికారులు వస్తున్నారనే సమాచారంతో ‘మార్నింగ్ వాక్’ పేరుతో ఇంటి నుంచి వెళ్లి పరారయ్యారు. భీమ్‌రెడ్డి అరెస్టు వార్త బయటకు రాగానే కొందరు బినామీలు తమ మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసి సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో మరింతమంది అనుమానితులపై నిఘా ఉంచామని, త్వరలోనే మరిన్ని నిజాలు బయటపడతాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *