Breaking News

ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట.. అసలు కోర్టు ఏం చెప్పిందంటే?

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఐబొమ్మ పైరసీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో పాక్షిక ఊరట లభించింది. పోలీసులు ఫ్రీజ్ చేసిన తన బ్యాంకు ఖాతాలను ఇకపై రోజువారీ అవసరాలు, భవిష్యత్ లావాదేవీల కోసం వినియోగించుకోవడానికి నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతినిచ్చింది. అయితే, అదే ఖాతాల్లో ఇప్పటికే నిల్వ ఉన్న సుమారు రూ. 3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేసేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది.

రూ. 3 కోట్ల అన్‌ఫ్రీజ్‌పై ఆంక్షలు యథాతథం:

తన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కుటుంబాన్ని పోషించడం కూడా కష్టమవుతోందని పేర్కొంటూ ఇమ్మడి రవి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఖాతాల్లోని రూ. 3 కోట్ల నిధులను అన్‌ఫ్రీజ్ చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. విచారణ జరిపిన కోర్టు, ఖాతాల్లోని రూ. 3 కోట్లపై సీజ్ ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కేవలం భవిష్యత్తులో జరిగే రోజువారీ లావాదేవీలకు, ఖాతాల ఆపరేషన్‌కు మాత్రమే పరిమిత సదుపాయం కల్పించింది.

పైరసీ, బెట్టింగ్ యాప్‌ల విచారణ:

సినిమాల పైరసీతో పాటు, ఐబొమ్మ వెబ్‌సైట్ ట్రాఫిక్‌ను అక్రమ బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లించి కోట్లాది రూపాయల అక్రమ ఆదాయం గడించారన్న ఆరోపణలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని గతంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న రవికి చెందిన రూ. 3 కోట్ల డిపాజిట్లపై దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *