హైదరాబాద్‌కు చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ కుమారి ఆంటీ (దాసరి సాయికుమారి) తన బిజినెస్, రోజువారీ ఆదాయం మరియు వ్యక్తిగత విషయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీది మొత్తం 1000 అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా” అనే డైలాగ్‌తో పాపులర్ అయిన ఆమె, తాను వైరల్ కాకముందే వ్యాపారం మరింత బాగా జరిగేదని పేర్కొన్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. గతంలో తన హోటల్‌కు రోజుకు 1,500 మంది వరకు కస్టమర్లు వచ్చేవారని, కానీ ఇప్పుడు జనాల రద్దీ ఎక్కువైందన్న భావనతో ఆ సంఖ్య 1,000కి తగ్గిపోయిందని చెప్పారు. ప్రస్తుతం రోజుకు రూ. 20,000 వరకు కౌంటర్ సేల్ జరుగుతున్నప్పటికీ, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఖర్చులు కూడా అంతేస్థాయిలో ఉంటున్నాయని వివరించారు. గతంలో కేజీ చికెన్ రూ. 140 ఉంటే ఇప్పుడు రూ. 300 అయిందని, బియ్యం బస్తా ధర రూ. 1,000 నుంచి రూ. 1,800కి పెరిగిపోవడంతో వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన గతాన్ని గుర్తు చేసుకుంటూ… హైదరాబాద్ రాకముందు సొంత ఊరిలో రోజుకు రూ. 50 కూలీకి పనులకు వెళ్లేదాన్నని, 2011లో ఏదైనా సాధించాలనే పట్టుదలతో నగరానికి వచ్చి ఈ హోటల్ ప్రారంభించానని తెలిపారు. హోటల్ తొలగింపు వివాదం సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అండగా నిలిచారని, ఆయన తన దృష్టిలో దేవుడు అని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం 7 సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నానని, గతంలో బిగ్ బాస్ అవకాశం వచ్చినా వెళ్లలేకపోయానని, అయితే ఈసారి పిలుపు వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తానని కుమారి ఆంటీ స్పష్టం చేశారు.

