హైదరాబాద్: ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి సాగునీరు విడుదల చేయాలని కోరిన రైతులను, వారికి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల ఆవేదనను ఆలకించి నీళ్లు ఇవ్వాల్సింది పోయి అక్రమ అరెస్టులకు పాల్పడటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక్షస మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మంది రైతులను పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. జూరాల ప్రాజెక్టు వద్ద ముళ్లకంపలు, బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా బలగాలను మోహరించడం ప్రభుత్వ నిరంకుశత్వానికి అద్దం పడుతోందన్నారు.
పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా?: జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 9 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సాగునీరు విడుదల చేయకుండా పంటలను ఎండబెడుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంటలను బతికించుకోవడానికి ప్రాజెక్టు వద్దకు వెళ్లిన రైతులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను, రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేసి, జూరాల ఆయకట్టుకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

