Breaking News

కాంగ్రెస్ రాక్షస పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి: హరీష్ రావు

యాదాద్రి భువనగిరి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ సమస్యలను, ఇతర ప్రజా సమస్యలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ “రాక్షస పాలన” సాగిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ వందలాది మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని, ఇది కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాబోతుదనడానికి స్పష్టమైన సూచిక అని అన్నారు. ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కూడా తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నట్లు వ్యక్తమైందని పేర్కొన్నారు.

రైతాంగాన్ని దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కేసీఆర్ దశాబ్ద కాల పాలన రైతులకు స్వర్ణయుగమని, సాగునీరుతో పాటు ఉచితంగా 24 గంటల విద్యుత్ అందించామని హరీష్ రావు గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కనీసం 6 నుండి 7 గంటల విద్యుత్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతోందని మండిపడ్డారు. ‘రైతు భరోసా’ కింద ఎకరాకు రూ. 15,000 ఇస్తామని చెప్పి, ప్రతి సీజన్‌కు విస్తీర్ణాన్ని కుదిస్తూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా రుణమాఫీ చేస్తానని ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి, పలు గడువులు ముగిసినా ఇప్పటికీ 50 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేకపోయారని దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ‘రైతు బీమా’ ద్వారా రైతు మరణించిన వారంలోపే రూ. 5 లక్షల సహాయం అందించేదని, ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టిందని ఆరోపించారు.

కృత్రిమ కరువు సృష్టి: రాష్ట్రంలో నెలకొన్న వర్షాల కొరత, నీటి ఎద్దడి మరియు విద్యుత్ సమస్యలను ప్రభుత్వం ఎల్-నినోపై తోసేస్తూ తప్పించుకోవాలని చూస్తోందని.. ఇది ప్రభుత్వ చేతగానితనం వల్ల ఏర్పడిన “కృత్రిమ కరువు” అని వ్యాఖ్యానించారు. కృష్ణా నదిలో నీటి కొరత లేకపోయినా కల్వకుర్తి, ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టుల వద్ద మోటార్లను నడపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్ సబ్‌స్టేషన్ ఆకస్మిక తనిఖీ – ఫామ్‌హౌస్‌లపై సవాల్: సభ అనంతరం మోటకొండూర్ పవర్ సబ్‌స్టేషన్‌ను హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిజంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే లాగ్‌బుక్ దాచడం ఎందుకని విద్యుత్ శాఖ అధికారులపై మండిపడ్డారు. అలాగే బీఆర్ఎస్ నేతల ఆస్తులపై విచారణలపై స్పందిస్తూ.. తనకు ఎలాంటి గెస్ట్ హౌస్‌లు లేవని స్పష్టం చేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్లలో నిర్మించిన కాంగ్రెస్ నాయకుల ఫామ్‌హౌస్‌లను ముందుగా అధికారులు కూల్చివేయాలని ఆయన సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *