Breaking News

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

లేపాక్షి, సెప్టెంబరు 28:(:E6tv NEWS: ప్రతినిధి)

శ్రీ సత్యసాయి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ లేపాక్షి మండల కేంద్రంలో రైతులు, వ్యవసాయ కూలీలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో మహాధర్నాలో పాల్గొనాలని సీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు నరసింహప్ప పిలుపునిచ్చారు.

శ్రీ సత్యసాయి జిల్లాలోని 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలు సాగు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం, పంటలు సాగు చేయని రైతులకు ఎకరాకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు.రైతు రుణాలను మాఫీ చేయాలని, ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా పంట నష్టపరిహారం అందించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పాడి, పండ్ల తోటల రైతులకు ప్రత్యేక సహాయం అందించాలని, పట్టు రైతులకు పెండింగ్‌లో ఉన్న రూ.82 కోట్ల ప్రోత్సాహక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

అన్ని గ్రామాల్లో పశుగ్రాస కేంద్రాలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, తెల్ల రేషన్ కార్డుదారులకు ఆరు నెలల పాటు ఎనిమిది రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా అందించాలని కోరారు. అన్ని పంటలకు ఉచిత పంటల బీమా అమలు చేయాలని, కరువు పరిస్థితుల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని అన్నారు. పశుపోషణకు బ్యాంకుల ద్వారా 90 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

పీఏబీఆర్ కుడికాలువకు ఆంధ్రనీవా ద్వారా లింక్ ఏర్పాటు చేసి, కుడికాలువ పరిధిలోని అన్ని చెరువులను నీటితో నింపేందుకు చర్యలు తీసుకోవాలని నరసింహప్ప కోరారు.రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం చేపడుతున్న మహాధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *