ప్రతి బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం
మూడు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి)
నేరెళ్ల బాధితులకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు న్యాయం చేయడంలో విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేరెళ్ల బాధితుల అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న నాయకులు, ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
2017లో నేరెళ్లలో జరిగిన ఘటన తెలంగాణ సమాజం తలదించుకునే ఘటన అని కవిత పేర్కొన్నారు. ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు అక్కడి ప్రజలపై పోలీసులు దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు అప్పట్లో వెలువడ్డాయని, ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా స్పందించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.నేరెళ్ల ఘటనలో బాధితులుగా ఉన్న ఎనిమిది కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాయని కవిత అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటనలో బాధిత కుటుంబాలకు కొంతమందికి రూ.5 లక్షలు, మరికొంతమందికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షల పరిహారం అందించినప్పటికీ, ఇంతకాలం వైద్య, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు ఈ మొత్తం సరిపోదని ఆమె అభిప్రాయపడ్డారు.
బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం, మూడు ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని కోరారు.నేరెళ్ల ఘటనకు సంబంధించిన కీలక నివేదికలు అందుబాటులో లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు. జైలర్ నివేదికలు, అప్పటి డీఐజీ రవివర్మ బాధితులతో మాట్లాడిన నివేదికలు, జాతీయ ఎస్సీ కమిషన్ నిర్వహించిన విచారణకు సంబంధించిన రికార్డులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బాధితులపైనే నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కవిత కోరారు. సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
నేరెళ్ల ఘటనపై అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా ప్రశ్నలు ఉన్నాయని, అదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాధితులకు సంపూర్ణ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని కవిత పేర్కొన్నారు. పాత రికార్డులు, విచారణ నివేదికలు అందుబాటులో లేకపోతే అవి ఎలా మాయమయ్యాయో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రభుత్వానికి లేఖ రాస్తామని కవిత తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలు, ప్రకటనలతో సమస్య పరిష్కారం కాదని, బాధిత కుటుంబాలకు శాశ్వత పునరావాసం, పరిహారం, ఉద్యోగం కల్పించినప్పుడే న్యాయం జరిగినట్లు భావించగలమని అన్నారు.

