జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి
బాధిత జర్నలిస్టులకు న్యాయం చేయాలి,
దళిత జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షుడు గంధం రాజేష్.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జర్నలిస్టులపై దాడులు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని దళిత జర్నలిస్ట్ ఫోరమ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫోరమ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ సాయిలుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా దళిత జర్నలిస్ట్ ఫోరమ్ (డీజేఎఫ్) అధ్యక్షుడు గంధం రాజేష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగాయనే ఆరోపణలు రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ వృత్తిపరమైన విధులను స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించేలా ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని కోరారు.గంభీరావుపేట ఘటనపై నిష్పాక్షికంగా సమగ్ర విచారణ జరిపించాలని, ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత జర్నలిస్టులకు న్యాయం చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి కీలకమని, జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవం, వృత్తిపరమైన స్వేచ్ఛను కాపాడేందుకు జర్నలిస్టులందరూ ఐక్యంగా నిలవాలని గంధం రాజేష్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జన ప్రజావాణి సీఈఓ శ్రీనివాస్, దళిత జర్నలిస్ట్ ఫోరమ్ గౌరవ అధ్యక్షుడు అశోక్ కాంబ్లే, మోహన్, రాహుల్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

