లక్కంపల్లి సెజ్‌లో అనువైన స్థలాల పరిశీలన..
రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమల ఏర్పాటుకు కృషి…
నిజామాబాద్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: శివ ఠాకూర్).
నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానిక రైతాంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలాలను ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా సెజ్ ప్రాంతంలో ఫ్యాక్టరీ కోసం గుర్తించిన స్థలాల అనుకూలతపై అధికారులతో చర్చించారు. భవిష్యత్తులో రిఫైనరీ ఏర్పాటుకు కూడా స్థలం అందుబాటులో ఉండటం, నిర్మల్ జిల్లాకు 50 కిలోమీటర్ల లోపే చేరువగా ఉండటం, నిజామాబాద్–నిర్మల్ జిల్లాల్లో ఇప్పటికే 17 వేల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగు జరుగుతుండటం, మరో 5 వేల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండటం ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూల అంశాలని అధికారులు వివరించారు.స్థలానికి సంబంధించిన సమగ్ర వివరాలతో నివేదికను సమర్పించాలని సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థల నిర్ధారణ పూర్తయిన వెంటనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఆయిల్ పామ్ సాగు అత్యంత లాభదాయకమైన పంటగా పేర్కొన్న సుదర్శన్ రెడ్డి.. రైతులు అధిక లాభాలు పొందేలా ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందన్నారు. వంట నూనెతో పాటు అనేక ఉత్పత్తుల్లో ఆయిల్ పామ్‌కు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా సాగు పెరిగితే రైతులకు ఆదాయం పెరగడంతో పాటు వంట నూనెల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు.

ఇతర పరిశ్రమల ఏర్పాటుకు కృషి
లక్కంపల్లి సెజ్ ప్రాంతంలో రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమల ఏర్పాటుకు కూడా కృషి చేస్తామని సుదర్శన్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. మధ్యప్రదేశ్‌లో సేంద్రీయ పద్ధతుల్లో చేపడుతున్న కూరగాయల సాగును అధ్యయనం చేసి, జిల్లాలోనూ ఆ తరహా సాగును ప్రోత్సహిస్తామని వెల్లడించారు.
నీటిని పొదుపుగా వినియోగించాలి
ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవని నేపథ్యంలో రైతులు నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలని, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


