Breaking News

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడు కాలే పండురంగకు శిక్ష.. రూ.5 వేల జరిమానా విధించిన ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం

నిజామాబాద్, అక్టోబర్ 15 (E6tv న్యూస్: శివ ఠాకూర్).

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు కాలే పండురంగకు న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి దుర్గాప్రసాద్ తీర్పు వెలువరించారు. నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా కూడా విధించారు.

2021లో నమోదైన కేసు.. సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021 మార్చి 18న బాధిత బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో బాలికపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం సంబంధిత ఆధారాలు, సాక్ష్యాలను న్యాయస్థానంలో సమర్పించి విచారణ కొనసాగించారు.కేసులోని ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ శిక్ష విధించింది.

ఐపీసీ, పోక్సో చట్టాల కింద శిక్షలు

ఐపీసీ సెక్షన్ 376AB కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను, పోక్సో చట్టంలోని సెక్షన్ 5(m)తో పాటు సెక్షన్ 6 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానాను న్యాయస్థానం విధించినట్లు పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది.

బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

మైనర్ బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. బాధితులకు న్యాయం అందించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. బాలలపై లైంగిక నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *