26వ డివిజన్లో రోడ్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఇందూరు, అక్టోబర్ 14 (E6 న్యూస్: శివ ఠాకూర్).
నిజామాబాద్ నగరంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు (స్పెషల్ ఫండ్) కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
నగరంలోని 26వ డివిజన్లో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది మున్సిపల్ కార్పొరేషన్లో పాలకవర్గం లేకపోవడం, కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడిందన్నారు.ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్‌కు రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి డివిజన్లో కోటి రూపాయల విలువైన అభివృద్ధి పనులు కూడా ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు.
నగర అభివృద్ధిలో భాగంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా మరిన్ని పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖిల్లా రామాలయం వద్ద రోప్‌వే నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమవుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, స్థానిక కార్పొరేటర్ బంటు రాము, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



