ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలి
పెద్దపల్లిలో ముస్లిం ఐక్యవేదిక నిరసన.. కలెక్టర్‌కు వినతిపత్రం
పెద్దపల్లి, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి).
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు.
ముస్లిం ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని వారు ఆరోపించారు.ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం దేశంలో 18 ఏళ్లు పైబడిన ఓటర్లు సుమారు 99.1 కోట్ల మంది ఉన్నారని పేర్కొంటూ, ఓటర్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సుమారు 13 కోట్ల మంది ఓటర్లను తొలగించినట్లు వారు ఆరోపించారు. 2024 నుంచి ఇప్పటివరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో గతంలో అనుసరించిన పద్ధతిని పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. తమ అభ్యంతరాలను ప్రభుత్వం, ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక నాయకులతో పాటు సీపీఐ నాయకులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

