Breaking News

రైతుల పొట్ట కొడుతున్న మిల్లర్ల సిండికేట్‌?

కోటగిరిలో అన్నదాతల ఆవేదన.. ఓపెన్ మార్కెట్ వ్యాపారులను అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు

కొనుగోలు సమయంలో రకాల పేరుతో ధరల్లో కోత.. విక్రయాల సమయంలో సన్న బియ్యానికి భారీ ధరలు

రైతులకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి

కోటగిరి, అక్టోబర్ 24 (E6tv న్యూస్).

కష్టపడి పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కడం లేదని, స్థానిక రైస్ మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓపెన్ మార్కెట్ వ్యాపారులను కొనుగోళ్లు చేయకుండా అడ్డుకుంటున్నారని కోటగిరి మండల రైతులు ఆరోపించారు. మిల్లర్ల తీరుతో ధాన్యం ధరలు తగ్గుతున్నాయని, తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు.

కోటగిరి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు రైతులు తమ సమస్యలను వెల్లడించారు. గతంలో బీపీటీ రకం ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.3,700 నుంచి రూ.3,900 వరకు కొనుగోలు చేశారని తెలిపారు. ప్రస్తుతం స్థానిక రైస్ మిల్లర్లు ఒక్కటై ఇతర ప్రాంతాల వ్యాపారులను రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, దీంతో ధాన్యం ధరలు తగ్గుతున్నాయని ఆరోపించారు.

క్వింటాల్ బియ్యం రూ.8 వేలంటూ రైతుల ఆవేదన

గత సీజన్‌లో మద్దతు ధర ప్రకారం క్వింటాల్ ధాన్యాన్ని సుమారు రూ.2,200కు కొనుగోలు చేసినప్పటికీ, అదే ధాన్యంతో తయారైన బియ్యాన్ని ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.8,000 వరకు విక్రయిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు నుంచి బియ్యం విక్రయాల వరకు ధరల్లో భారీ వ్యత్యాసం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి, మిల్లింగ్, రవాణా, నిల్వ తదితర ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, రైతులకు మాత్రం తగిన లాభం దక్కడం లేదని అన్నారు.

కొనేటప్పుడు రకాల పేరుతో ధరల్లో కోత.. అమ్మేటప్పుడు సన్న బియ్యం పేరుతో విక్రయాలు!

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో సిద్ధి, గంగా, కావేరి, కోనారం, బీపీటీ వంటి రకాల పేర్లతో ధరల్లో వ్యత్యాసం చూపుతున్నారని రైతులు ఆరోపించారు. అదే ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన తర్వాత రకాల వారీగా విక్రయిస్తున్నారా? లేక వివిధ రకాల బియ్యాన్ని కలిపి సన్న బియ్యం పేరుతో మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారా? అని ప్రశ్నించారు.కొనుగోలు సమయంలో రకాల పేరుతో ధరలు తగ్గించడం, విక్రయాల సమయంలో మాత్రం అధిక ధరలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

ఓపెన్ మార్కెట్ వ్యాపారులకు అవకాశం కల్పించాలి

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తే స్థానిక మిల్లర్లు అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపించారు. వ్యాపారుల మధ్య పోటీ ఉంటే రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల బయటి వ్యాపారులు స్వేచ్ఛగా కొనుగోళ్లు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.రైతుల ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి, మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి, ధరల వ్యత్యాసాలు, వ్యాపారుల కార్యకలాపాలను పరిశీలించాలని కోరారు. రైతులకు నష్టం కలిగించే విధానాలు ఉన్నట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రైతులు సాధాక్, వేముల నవీన్, మామిడి శ్రీనివాస్, చిత్తూరు శ్రీనివాస్, మామిడి చిన్న సాయిలు, ఈశ్వర్, మామిడి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

రైతుల డిమాండ్: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి.. కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలి.. మిల్లర్ల సిండికేట్‌ ఆరోపణలపై విచారణ జరపాలి.. ఓపెన్ మార్కెట్ వ్యాపారులకు అవకాశం కల్పించి అన్నదాతలకు న్యాయం చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *