ముంబయి, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఉన్నతస్థాయి బృందం ఆదివారం ముంబయిలో పర్యటించింది. ముంబయిలోని ఆంధ్ర మహాసభలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న పలువురు ఉద్యమకారులను కమిటీ సభ్యులు గుర్తించి సత్కరించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్ అడ్లంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరామ్, కమిటీ సభ్యులు మొతే శోభారెడ్డి తదితరులు ముంబయిలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన ఫోటో జర్నలిస్టు పిట్ల రామును కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో వివిధ రూపాల్లో సేవలందించిన ఉద్యమకారుల వివరాలను సేకరించి, అర్హత ఉన్న ప్రతి ఉద్యమకారుడికి గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. ఉద్యమకారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే గుర్తింపు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముంబయిలోని తెలంగాణ ఉద్యమకారులతో సమావేశమై వారి సమస్యలు, ఉద్యమ సమయంలో చేసిన సేవలు, ఎదుర్కొన్న పరిస్థితులపై కమిటీ సభ్యులు వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ఉద్యమకారులందరికీ గుర్తింపు కల్పించే దిశగా కమిటీ పనిచేస్తుందని తెలిపారు.


