Breaking News

జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

నిజామాబాద్ ధర్నా చౌక్‌లో ఇండియా కూటమి ధర్నా..

అనంతరం దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్, అక్టోబర్ 07: (E6tv NEWS: శివ ఠాకూర్): ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించారని, తెలంగాణలో దాదాపు 90 లక్షలకు పైగా, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 80 వేలకు పైగా ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే విధంగా ఉందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోరాడుతున్న సమయంలో వారిని అరెస్టు చేయడం బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా, తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) కార్యక్రమం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని నగేష్ రెడ్డి ఆరోపించారు. పీసీసీ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నాలు, దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టామని, రానున్న రోజుల్లో గ్రామస్థాయిలోనూ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు.కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసే వరకు ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని నగేష్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి రాములు, నగర మేయర్ ఉమారాణి, కల్లుగీత కార్మిక చైర్మన్ శేఖర్ గౌడ్, నూడా చైర్మన్ కేశ వేణు, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్‌తో పాటు మహిళా నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నగర కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *