Breaking News

దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

ఇండ్ల మంజూరులో దళారులను ఆశ్రయించవద్దు: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

భైంసా, అక్టోబర్ 7 (E6tv NEWS: ప్రతినిధి).

అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని, ఇళ్లు మంజూరు కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భైంసా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. బుధవారం భైంసా ఎంపీడీవో కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన 175 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భైంసా మండలంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. రానున్న రెండేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో భైంసా మండలంలోని తిమ్మాపూర్, హంపొలి, దేగాం గ్రామాల్లో సుమారు 150 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరైనప్పటికీ వాటి పరిస్థితి సక్రమంగా లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత పదేళ్లలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పెద్ద సంఖ్యలో ఇళ్లు మంజూరు కావడం సంతోషకరమని తెలిపారు.

దళారులను ఆశ్రయించవద్దు

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. ఇల్లు మంజూరు చేయిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగితే వారి మాటలు నమ్మి మోసపోవద్దని, దళారులను ఆశ్రయించవద్దని హెచ్చరించారు.పేదల కోసం ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంటే, కొందరు మాయమాటలు చెప్పి లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నియోజకవర్గానికి పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇన్‌చార్జ్ మంత్రి సహకారానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పండిత్ రావు పటేల్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *