Breaking News

జీపీ రోడ్డు కబ్జాపై గ్రామస్తుల ఆగ్రహం

500 మంది సంతకాలు కావాలంటున్న గ్రామ కార్యదర్శి తీరుపై మండిపాటు

ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఇంత నిర్లక్ష్యమా?

అక్బర్‌నగర్ గ్రామస్తుల ఆవేదన

అక్బర్‌నగర్, అక్టోబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి)

గ్రామంలో అనేక సంవత్సరాలుగా ఉన్న గ్రామపంచాయతీ (జీపీ) రోడ్డును పరిరక్షించి, పంచాయతీ ఆధీనంలోకి తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జీపీ రోడ్డుకు సంబంధించిన భూమి ప్రభుత్వ/గ్రామపంచాయతీకి చెందినదని, దీనిపై గతంలో గ్రామపంచాయతీ సమావేశాల్లో పలుమార్లు తీర్మానాలు కూడా చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ విషయంపై గ్రామస్తులు ఇప్పటికే సంతకాలు చేసి గ్రామపంచాయతీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీపీ రోడ్డును స్వాధీనం చేసుకోవాలంటే సుమారు 500 మంది సంతకాలు కావాలని గ్రామ కార్యదర్శి పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది?

గ్రామంలో ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించి, పంచాయతీ ఆధీనంలోకి తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ప్రభుత్వ భూమి విషయంలో ప్రశ్నించిన గ్రామస్తులపై అక్రమ కేసులు నమోదయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.

సీసీ రోడ్లు వేసినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపణ

గ్రామంలో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించినప్పటికీ వాటిపై మొరం వేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, పలుచోట్ల ముళ్లపొదలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.జీపీ రోడ్డు, ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు గ్రామంలోని డ్రైనేజీలు, రోడ్ల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అక్బర్‌నగర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని ఇతరుల ఆధీనంలోకి వెళ్లకుండా కాపాడాలని, ఇప్పటికే పంచాయతీ సమావేశాల్లో చేసిన తీర్మానాలను అమలు చేసి జీపీ రోడ్డును అధికారికంగా పరిరక్షించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *