Breaking News

హిందూ ఆలయాలపై దాడులు అమానుషం

నిందితుడిని కఠినంగా శిక్షించాలి: హిందూ సంఘాల నాయకులు

రుద్రూర్, అక్టోబర్ 4: (E6tv NEWS: ప్రతినిధి).

హిందూ ఆలయాలపై దాడులకు పాల్పడటం అమానుషమని హిందూ సంఘాల నాయకులు అన్నారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ సంతోషిమాత ఆలయంపై దాడి చేసిన నిందితుడు మహమ్మద్‌ అన్సారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం రుద్రూర్‌ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ చౌక్‌ వద్ద హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా నిందితుడి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. హిందువులు మౌనం పాటించడం వల్లే ఇలాంటి ఘటనలకు పాల్పడేవారికి ధైర్యం వస్తోందని అన్నారు.

శ్రీ సంతోషిమాత ఆలయంపై దాడికి పాల్పడిన మహమ్మద్‌ అన్సారికి మతిస్థిమితం లేదని సర్టిఫికెట్‌ ఇవ్వడంపై నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.హిందువులు ఎక్కడ సురక్షితంగా ఉంటారో.. అక్కడే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ నాయకులు పార్వతి మురళి, హిందూ సంఘాల నాయకులు అడప నవీన్, తాటిపాముల హరీష్, గణేష్, పత్తి నవీన్, వడ్ల రాజు, తోట్ల ప్రవీణ్, నరేందర్, ఎముల గజేందర్, మొద్దుల నర్సయ్య, తమ్మలి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *