ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన 45 మంది యాత్రికులు ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ మార్గంలో గౌరీకుండ్ సమీపంలో సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో అక్కడే చిక్కుకుపోయారు. కేదార్నాథ్ స్వామివారి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరగడంతో, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
చిర్బాసా సమీపంలో కొండచరియలు పడటంతో యాత్రకు వెళ్లే దారులు, కాలినడక మార్గాలు పూర్తిగా మూసుకుపోయి వేలాది మంది యాత్రికులు వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఉత్తరాఖండ్ ప్రభుత్వం, SDRF, NDRF బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, శిధిలాలను తొలగిస్తూ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వర్షాల ధాటికి 80కి పైగా రహదారులు దెబ్బతినడంతో అధికారులు చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

