అవసరమైతే అసెంబ్లీలో ధర్నా చేస్తా.. – ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల జాప్యంపై మహా ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని డిమాండ్
ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి భిక్షాటన చేసిన ఎమ్మెల్యే
ఇందూరు, అక్టోబర్ 27 (E6TV న్యూస్: శివ ఠాకూర్).
నిజామాబాద్ నగర శివారులోని మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇందూరులో బీజేపీ గెలిచిందనే కారణంతోనే మాధవ్ నగర్ ROB విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మాధవ్ నగర్‌లో మహా ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. తాను ఇక్కడికి ఎమ్మెల్యేగా కాకుండా ప్రజల్లో ఒకడిగా, వారి బాధలను పంచుకోవడానికి వచ్చానని పేర్కొన్నారు. మాధవ్ నగర్ రైల్వే గేటు కారణంగా స్థానిక ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైల్వే గేటుతో నిత్యం ట్రాఫిక్ కష్టాలు
మాధవ్ నగర్ రహదారిపై ప్రతిరోజూ సుమారు 4 వేల నుంచి 5 వేల వరకు వివిధ రకాల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా రోజుకు సుమారు 58 రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో రైల్వే గేటు పదేపదే మూసివేయాల్సి వస్తోందన్నారు. ఒక్కోసారి 15 నుంచి 20 నిమిషాల వరకు గేటు మూసివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని వివరించారు.దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఆలస్యమవుతున్నారని, కూలీలు పనులకు, ఉద్యోగులు విధులకు సమయానికి చేరుకోలేకపోతున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అంత్యక్రియల కోసం మృతదేహాలను స్మశానవాటికలకు తీసుకెళ్లడంలోనూ ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు.
కేంద్ర నిధులు మంజూరైనా.. రాష్ట్ర పనులు ఎక్కడ?
మాధవ్ నగర్ ROB నిర్మాణం కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి నిధులు మంజూరు చేయించారని ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. రైల్వే శాఖ తనవంతు పనులు పూర్తి చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు.గత ఏడాది రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి ROB పనులను త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు గుర్తు చేశారు. అప్పట్లో పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అవసరమైతే అసెంబ్లీలోనూ ధర్నా
మాధవ్ నగర్ ROB నిర్మాణం పూర్తికాకపోవడం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన నిధులు విడుదల చేసి, పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్య పరిష్కారం కోసం అవసరమైతే అసెంబ్లీలోనూ ధర్నా చేస్తానని హెచ్చరించారు.ROB నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి భిక్షాటన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మాధవ్ నగర్ రైల్వే గేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.



