Breaking News

యువత భవిష్యత్‌కు పోలీస్ శాఖ చేయూత

పోలీస్ ఉద్యోగ లక్ష్యానికి 300 మంది యువతకు ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ

నిర్మల్, అక్టోబర్ 1:(E6tv NEWS: ప్రతినిధి).

పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, IAS సహకారంతో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS ఆధ్వర్యంలో నిర్మల్ పోలీస్ బ్రీఫింగ్ హాల్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 300 మంది విద్యార్థులకు ఈ శిక్షణ అందించనున్నారు.

పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించిన సిలబస్, పరీక్ష విధానం, ముఖ్యమైన అంశాలు, పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యే విధానంపై నిపుణులైన ఫ్యాకల్టీ సత్య ఎర్రగడిన్ల, గంగాధర్, శ్రీకాంత్, కలీం, SI సంజీవ్, RSI రవి తదితరులు శిక్షణ ఇవ్వనున్నారు.ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, టీని ఉచితంగా అందించనున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల సాధనలో సరైన మార్గదర్శకత్వం అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.అభ్యర్థులు క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వంతో పాటు రాత పరీక్షకు కూడా ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. ప్రతిరోజూ తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఫ్యాకల్టీ అందించే మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

300 మంది విద్యార్థులకు అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని స్పష్టమైన లక్ష్యంతో కష్టపడి చదవాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలని, అభ్యర్థులు ఎలాంటి నిరుత్సాహానికి లోనుకాకుండా పట్టుదలతో ముందుకు సాగాలని అన్నారు.సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, నిరంతర కృషితో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చని.. పోలీస్ ఉద్యోగాల లక్ష్యంతో ఉన్న యువతకు జిల్లా పోలీస్ శాఖ తరఫున అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఎస్పీ తెలిపారు.కార్యక్రమంలో భైంసా ASP సాయి కిరణ్, IPS, నిర్మల్ DSP శ్రీనివాస్, CIలు కృష్ణ, సమ్మయ్య, RI (Admin) రామ్ నిరంజన్, SIలు, పోలీస్ సిబ్బంది, ఫ్యాకల్టీ సభ్యులు, 300 మంది శిక్షణార్థి విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *