Breaking News

బాన్సువాడకు మంత్రి సీతక్క రాక.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం!

బాన్సువాడ, అక్టోబర్ 26 (E6tv న్యూస్):

బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాలకు భూమిపూజ చేసేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క మంగళవారం (అక్టోబర్ 27) బాన్సువాడలో పర్యటించనున్నారు.

మంత్రి సీతక్క పర్యటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.

మంత్రి పర్యటన షెడ్యూల్

మధ్యాహ్నం 2 గంటలకు – కొయ్యగుట్ట తాండ: బాన్సువాడ గ్రామీణ మండలంలోని కొయ్యగుట్ట తాండలో నూతన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు – బాన్సువాడ పట్టణం: పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించనున్నారు.

మధ్యాహ్నం 3:30 గంటలకు – బోర్లం గ్రామ శివారు: బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు.

మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో చేపట్టి, అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *