మెట్పల్లి, అక్టోబర్ 07 (E6tv NEWS: ప్రతినిధి) జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు బస్సు టైర్ కిందపడి నుజ్జునుజ్జయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నాగపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు కొత్త బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. నిజామాబాద్ నుంచి మెట్పల్లి బస్టాండ్‌లోకి వస్తున్న కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె బస్సు టైర్ కింద పడటంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

