Breaking News

దళారీ వ్యవస్థ దెబ్బకు రైతులకు నష్టాలు!

రోజుకు రూ.100 చొప్పున తగ్గుతున్న ధాన్యం ధర

రుద్రూరు, అక్టోబర్ 10 (E6TV న్యూస్: ప్రతినిధి).

దళారీ వ్యవస్థ కారణంగా ధాన్యం ధరలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రుద్రూరు ప్రాంతానికి చెందిన రైతు గౌరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గిస్తున్నారని, దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా రైతు గౌరప్ప మాట్లాడుతూ.. నిన్నటి వరకు క్వింటాల్ ధాన్యానికి రూ.3,600 ధర లభించగా, ప్రస్తుతం రూ.3,500కే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు రూ.3,800 వరకు ధర పలికిన ధాన్యం ధర క్రమంగా తగ్గిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు సుమారు రూ.100 చొప్పున ధర తగ్గుతుండటంతో పంటను అమ్ముకోవాలా.. లేక మరికొంతకాలం వేచి చూడాలా అనే అయోమయంలో రైతులు ఉన్నారని పేర్కొన్నారు.సుమారు 10 ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.3,500 చొప్పున విక్రయించాల్సి వస్తోందని, దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని గౌరప్ప తెలిపారు. పెట్టుబడులు, సాగు ఖర్చులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ధాన్యానికి సరైన ధర లభించకపోవడం రైతులకు భారంగా మారిందన్నారు.

సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లపై పర్యవేక్షణ పెంచాలని, దళారుల సిండికేట్‌ కారణంగా రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని రైతు గౌరప్ప కోరారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *