బతుకమ్మ పండుగ మనదని గర్వంగా చెప్పుకోవాలి: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హస్తినాపురం, హైదరాబాద్ (E6TV న్యూస్):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లోని హస్తినాపురం డీఆర్డీఎల్ కాలనీ వాసులతో కలిసి ఆమె బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మన పండుగలు, పద్ధతులు, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాలని సూచించారు. బతుకమ్మ పండుగ మనదని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత సంప్రదాయ బతుకమ్మ పాటలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఒక్కసారి పాట నేర్చుకుంటే ఆ పాట తరతరాల పాటు నిలిచిపోతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం డీజే పాటలు ఉన్నప్పటికీ, వాటితోపాటు సంప్రదాయ బతుకమ్మ పాటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మన సంస్కృతిని కాపాడుకోవడంలో యువత కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
డీఆర్డీఎల్ కాలనీలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు నిర్వాహకులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారని కవిత ప్రశంసించారు. ఇదే ఒరవడిని ప్రతి సంవత్సరం కొనసాగించాలని కోరారు.పండుగలకు పార్టీలు, రాజకీయాలు ఉండవని, అందరూ కలిసి మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. బతుకమ్మ వంటి పండుగల ద్వారా మహిళల్లో ఐక్యత పెరగడంతోపాటు తెలంగాణ సాంస్కృతిక వైభవం మరింత విస్తరిస్తుందని పేర్కొన్నారు.
డీఆర్డీఎల్ కాలనీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయ పాటలు పాడుతూ పండుగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.



