మూడు రోజులుగా మిషన్ భగీరథ పైపు లీకేజీ.. పట్టించుకోవడం లేదని కాలనీ వాసుల ఆవేదన
రుద్రూరు, అక్టోబర్ 16 (E6 న్యూస్: ప్రతినిధి).
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలోని జవహర్ నగర్ కాలనీ 14వ వార్డులో డ్రైనేజీ సమస్య జటిలంగా మారింది. గత మూడు రోజులుగా మిషన్ భగీరథ పైపు లీకేజీ కారణంగా నీరు భారీగా ప్రవహిస్తున్నప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాలనీలో గత మూడు రోజులుగా డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే నిర్మాణ పనుల సమయంలో మిషన్ భగీరథకు సంబంధించిన నీటి పైపు దెబ్బతినడంతో నీరు లీకై డ్రైనేజీలోకి భారీగా ప్రవహిస్తోంది. ఒకవైపు డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతుండగా, మరోవైపు నీరు నిరంతరంగా ప్రవహిస్తుండటంతో పనుల నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీరు నిలిచిన ప్రాంతంలోనే డ్రైనేజీ నిర్మాణం చేపడితే పనులు నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉందని, నిర్మించిన కాలువలు ఎక్కువ కాలం మన్నికగా ఉండకపోవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా నీటి ప్రవాహం కారణంగా పక్కనే ఉన్న ఇళ్లకు సైతం ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.
మిషన్ భగీరథ పైపు లీకేజీతో మురికి కాలువలో నీరు నదిలా ప్రవహిస్తోందని, సమస్యను సంబంధిత అధికారులకు, పాలకులకు పలుమార్లు తెలియజేసినా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. వెంటనే లీకేజీని అరికట్టి, డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కోరుతున్నారు.
త్వరలో లీకేజీ మరమ్మతులు చేపడతాం: ఉపసర్పంచ్ షేక్ నిస్సార్
ఈ సమస్యపై గ్రామ ఉపసర్పంచ్ షేక్ నిస్సార్‌ను ఫోన్‌లో వివరణ కోరగా, 14వ వార్డులో అభివృద్ధి పనుల్లో భాగంగా డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పనుల సమయంలో మిషన్ భగీరథ పైపు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. సంబంధిత సిబ్బందిని పంపించి లీకేజీని మరమ్మతు చేయిస్తామని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.డ్రైనేజీ పనులతో పాటు సీసీ రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపడుతున్నామని తెలిపారు. కొంతమంది మిషన్ భగీరథ నల్ల కనెక్షన్లు కావాలని కోరారని, వాటిని కూడా తీసుకోవాలని సూచించినట్లు వివరించారు.
సమస్యను త్వరితగతిన పరిష్కరించి, డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు పనులను నాణ్యతతో పూర్తి చేయాలని జవహర్ నగర్ కాలనీ 14వ వార్డు ప్రజలు కోరుతున్నారు.

