Breaking News

రూ. 40 వేల క్యాన్సర్‌ మందు ఇప్పుడు రూ. 2,700కే!

క్యాన్సర్‌ బాధితులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కీలకమైన కొన్ని క్యాన్సర్‌ మందుల ధరలను ఏకంగా 93 శాతం వరకు తగ్గిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) సంచలన నిర్ణయం తీసుకుంది. 137 రకాల మందులకు సంబంధించి మొత్తం 543 ఔషధ బ్రాండ్లు, ప్యాక్‌ల గరిష్ఠ చిల్లర ధరలను సవరించింది. పంపిణీదారులు, మధ్యవర్తుల ట్రేడ్‌ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేయడం వల్ల ఈ భారీ ఊరట లభించింది. ఈ నిర్ణయం ద్వారా రోగులకు ఏటా సుమారు రూ. 2,500 కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. సవరించిన ఈ కొత్త ధరలు 2026 నవంబర్‌ 9 నుంచి అమలులోకి రానున్నాయి.

కొత్త ధరల ప్రకారం.. గతంలో రూ. 40,421 ఉన్న ‘పాల్బోప్రో 125 ఎంజీ’ (21 క్యాప్సూల్స్ ప్యాక్) ధర రూ. 2,720కి పడిపోయింది. అలాగే కీమోథెరపీలో వాడే ‘థియోటెపా 100 ఎంజీ’ ఇంజెక్షన్ ధర రూ. 80,071 నుంచి ఏకంగా రూ. 7,150కి తగ్గడంతో ఒక్క వయల్‌పై దాదాపు రూ. 72,922 ఆదా కానుంది. అయితే సరఫరా వ్యవస్థలో అధిక మార్జిన్లు ఉన్న జెనరిక్, బయోసిమిలర్ మందుల ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ, తయారీదారుల ప్రాథమిక ధర ఎక్కువగా ఉన్న ‘కీట్రూడా’ (రూ. 2,16,500), ‘అవాస్టిన్’ వంటి అత్యంత ఖరీదైన కొన్ని మందుల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వైద్యులు సూచించే బ్రాండ్‌ను బట్టి రోగులకు ఈ లబ్ధి చేకూరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *