అర్నాబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించి, ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
చిన్నగుమ్ములూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించిన మంత్రి, అక్కడ బాధితులకు అందుతున్న ఆహారం, తాగునీరు, వసతులపై ఆరా తీశారు. అనంతరం ఇదేశమ్మ వాక వద్ద నిర్మాణం లో ఉన్న రిటైనింగ్ వాల్‌ను మరియు వరాహ నది నీటి ప్రవాహాన్ని స్వయంగా పరిశీలించారు. వర్షాల వల్ల నదులు, వాగుల్లో వరద ముప్పు పెరిగే అవకాశం ఉన్నందున, తీరప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు బాధితులకు అన్ని వేళలా అండగా ఉండాలని సూచించారు.

