Breaking News

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య

నిజామాబాద్, అక్టోబర్ 21 (E6tv న్యూస్: శివ ఠాకూర్).

శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరుల సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని అన్నారు. గత ఏడాది నిజామాబాద్‌లో సంఘవిద్రోహ శక్తుల చేతిలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ వీరమరణం పొందడం బాధాకరమని పేర్కొన్నారు. ముంబై ఉగ్రదాడుల సమయంలో కానిస్టేబుల్ తుకారాం ప్రదర్శించిన ధైర్యసాహసాలను గుర్తుచేశారు.

పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు తప్పిపోయిన చిన్నారులను వారి కుటుంబాల చెంతకు చేర్చడం, మహిళలకు భద్రత కల్పించడం, ప్రజలకు భరోసా కల్పించడం వంటి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించే కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ..  ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1986 నుంచి ఇప్పటివరకు 21 మంది పోలీసులు సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వారి త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువకూడదన్నారు.

అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీపీ భరోసా ఇచ్చారు. ఇప్పటికే 11 కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించామని, మిగిలిన పది కుటుంబాలకు వారు కోరుకున్న ప్రాంతాల్లో స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం లభించే వరకు పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.అమరవీరుల కుటుంబ సభ్యులు తమ సమస్యలను తెలియజేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కూడా ఆయా కుటుంబాలను స్వయంగా కలిసి వారి అవసరాలను తెలుసుకుంటారని వివరించారు.

అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ఏసీపీ (ఏఆర్) కృష్ణ, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీసీఎస్, ట్రాఫిక్, సీటీసీ విభాగాల ఏసీపీలు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *