వివాహ మధ్యవర్తుల సంక్షేమానికి జేఏసీ అండగా ఉంటుంది: అర్జున్ రావు
జగిత్యాల,అక్టోబర్ 26:(E6tv NEWS).
శ్రీ రాఘవేంద్ర మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తుల సంఘం (తెలంగాణ రాష్ట్రం) ఆధ్వర్యంలో ‘ఉత్తమ సేవా రత్న పురస్కారాల’ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు. సమాజంలో వివాహ బంధాలను కలపడంలో విశేష సేవలు అందిస్తున్న మధ్యవర్తులను గుర్తించి, వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు రాపర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ, సమాజంలో వివాహ బంధాలను కుదుర్చడంలో మధ్యవర్తులు చేస్తున్న నిస్వార్థ సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. కుటుంబాల మధ్య సంబంధాలను ఏర్పరచడంలో మధ్యవర్తుల పాత్ర కీలకమని, వారి సేవలకు తగిన గుర్తింపు కల్పించడంతో పాటు మరింత ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) అధ్యక్షులు అర్జున్ రావు మాట్లాడుతూ, వివాహ మధ్యవర్తులు సంఘటితంగా ముందుకు సాగాలని సూచించారు. జేఏసీతో కలిసి పనిచేయడం ద్వారా తమ హక్కులను కాపాడుకోవడంతో పాటు వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయవచ్చని అన్నారు.
వివాహ మధ్యవర్తులకు ఉపాధి భద్రత, సమాజంలో తగిన గుర్తింపు కల్పించే దిశగా జేఏసీ సహకరిస్తుందని తెలిపారు. మధ్యవర్తుల సంక్షేమం, వారి వృత్తి అభివృద్ధికి అవసరమైన మద్దతు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, వివాహ మధ్యవర్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

