Breaking News

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ధర్మవరంలో పోలీసుల మొబైల్ ర్యాలీ

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీఐలు రెడ్డప్ప, జయ నాయక్

ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా (E6tv న్యూస్).

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ జగన్నాథ్ రాజు పర్యవేక్షణలో ధర్మవరం పట్టణంలో వన్‌టౌన్, టూటౌన్ సీఐలు రెడ్డప్ప, జయ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మొబైల్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల అభ్యర్థులు, ప్రజలకు పోలీసులు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC), సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఐలు సూచించారు.ఎన్నికల కమిషన్ లేదా సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ గుంపులుగా గుమిగూడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఓటర్లను బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని పోలీసులు తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేసినా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలో గొడవలు, అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐలు రెడ్డప్ప, జయ నాయక్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *