Breaking News

‘చెప్పాం.. చేస్తున్నాం’.. స్థానిక ఎన్నికలకు చంద్రబాబు కొత్త నినాదం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. బుధవారం పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలతో సమన్వయంపై కీలక దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించినట్లే స్థానిక ఎన్నికల్లోనూ కూటమికి ప్రజల ఆశీర్వాదం లభించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తోందని, ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే రెబెల్స్ పట్ల చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పొత్తులో భాగంగా మిత్రధర్మాన్ని ప్రతీ ఒక్కరూ పాటించాలని, జనసేన, బీజేపీలకు కేటాయించిన స్థానాల్లో కూడా రెబెల్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. టికెట్లు దక్కని నేతలకు భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రెబెల్స్‌గా నామినేషన్లు వేస్తే వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో వారిపై సస్పెన్షన్ వేటు తప్పదని స్పష్టం చేశారు. ప్రజాసేవే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలోకి దింపి కూటమి ఘనవిజయానికి కృషి చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *