హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. శంషాబాద్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో (విమానం నం. AI 417) టేకాఫ్ అయిన కేవలం ఐదు నిమిషాలకే హఠాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది.
పైలట్ సమయస్ఫూర్తి: విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు సమాచారం అందించారు. ల్యాండింగ్‌కు అనుమతి కోరి విమానాన్ని వెనక్కి మళ్లించి విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు.
విచారణ చేపట్టిన ఇంజినీరింగ్ బృందం:ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 109 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ల్యాండింగ్ అనంతరం విమానాన్ని నిలిపివేసి, ఇంజినీరింగ్ మరియు సాంకేతిక బృందాలు లోపానికి గల కారణాలపై సమగ్ర విచారణను ప్రారంభించాయి.

