సైబర్ నేరాలు, డ్రగ్స్ రవాణా మరియు మారుతున్న నేర సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖల మధ్య పటిష్ట సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సదరన్ రీజియన్ పోలీస్ కోఆర్డినేషన్ కమిటీ (SRPCC) సమావేశంలో పాల్గొన్న ఆయన, మారుతున్న నేర సరళికి అనుగుణంగా పోలీసు సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సీఎం వివరించారు. హైదరాబాద్ పోలీసు వ్యవస్థను మూడు కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించడంతో పాటు ఈగల్ (EAGLE), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైడ్రా (HYDRAA), టీజీ-సేఫ్ (TG-SAFE) వంటి ప్రత్యేక విభాగాలు సాధించిన విజయాలను ప్రస్తావించారు. దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించామని వెల్లడించారు. అలాగే పోలీసు కుటుంబాల కోసం ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ ఏర్పాటుతో పాటు అమరవీరుల కుటుంబాలకు రూ. 1 కోటి నుండి రూ. 2 కోట్ల వరకు ఎక్స్గ్రేషియా, స్థలాలు మరియు కారుణ్య నియామకాలు అందిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సాంకేతిక సమాచారాన్ని పంచుకుంటూ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని పోలీసు అధికారులకు సీఎం పిలుపునిచ్చారు.
అంతర్రాష్ట్ర నేరాల కట్టడికి సరికొత్త వ్యూహం… :సీఎం రేవంత్ రెడ్డి

