Breaking News

ఆర్మీ జవాన్లకు అండగా నిలిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకారం.. ఎమ్మెల్యేకు, గ్రామ పెద్దలకు జవాన్ల కృతజ్ఞతలు

అక్బర్ నగర్, అక్టోబర్ 23 (E6tv న్యూస్).

దేశ రక్షణలో నిరంతరం సేవలందిస్తున్న ఆర్మీ జవాన్లకు అండగా నిలిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులకు అక్బర్ నగర్ గ్రామానికి చెందిన జవాన్లు కృతజ్ఞతలు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన సుమారు 10 నుంచి 20 మంది వరకు ఆర్మీ జవాన్లు దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన అప్పటి సర్పంచ్ తీగుళ్ల గంగామణి రాజవరప్రసాద్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు సహకరించడంతో పాటు, గ్రామపంచాయతీలో తీర్మానం చేయడం పట్ల జవాన్లు హర్షం వ్యక్తం చేశారు.ఈ విషయంలో అప్పటి తహసీల్దార్ ముజీబ్ కూడా సహకరించారని గుర్తుచేసుకుంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. దేశ రక్షణలో తమ సేవలను గుర్తించి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు కలిసికట్టుగా తమకు అండగా నిలవడం గర్వంగా ఉందని జవాన్లు పేర్కొన్నారు.

సేవలకు గుర్తింపు.. జవాన్లకు ప్రోత్సాహం

గ్రామ అభివృద్ధితో పాటు దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న సైనికుల సేవలను గుర్తించి వారికి సహకరించడం అభినందనీయమని జవాన్లు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు సహకరించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.

సామాజిక సేవలోనూ ముందంజలో జై జవాన్ ఫౌండేషన్

దేశ సేవలో ఉన్న ఆర్మీ జవాన్లు కలిసి జై జవాన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి, అనేక సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, నిరుపేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల అభిమానం పొందుతున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో ఉంచుకొని విద్యా వాలంటీర్లకు వేతనాలు అందించే కార్యక్రమానికి కూడా ఫౌండేషన్ సభ్యులు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు తెలిపారు. విద్యా రంగానికి సహకరించడంతో పాటు ఇతర గ్రామాల్లోనూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ పేదలకు అండగా నిలవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దేశ రక్షణలో బాధ్యతలు నిర్వహిస్తూనే సామాజిక సేవలోనూ భాగస్వాములవుతున్న జై జవాన్ ఫౌండేషన్ సభ్యుల సేవలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని స్థానికులు కొనియాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *