ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్పల్లి నగేష్ రెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 26 (E6TV న్యూస్).
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మవద్దని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్పల్లి నగేష్ రెడ్డి కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
సోమవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో నగేష్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురవడంతోపాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించామని తెలిపారు. అయితే ప్రస్తుత ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదని, ఈ ప్రభావం ప్రపంచంలోని పలు దేశాలతోపాటు భారతదేశం, తెలంగాణ రాష్ట్రంపైనా ఉందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించడం ప్రతిపక్షాల అవివేకానికి నిదర్శనమని విమర్శించారు.పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర నాయకుడు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి తదితర నాయకుల చొరవతో జిల్లాలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముందస్తు వర్షాల కారణంగా నిజాంసాగర్‌లో 10 టీఎంసీలు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 40 టీఎంసీల నీటి నిల్వలు ఉండటం రైతులకు కొంత ఊరటనిచ్చిందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గతంలో సుమారు 13 వేల మెగావాట్లుగా ఉండగా, ప్రస్తుతం దాదాపు 20 వేల మెగావాట్లకు చేరిందని నగేష్ రెడ్డి వివరించారు. నిజామాబాద్ జిల్లాకు కేటాయించిన 300 మెగావాట్లకు మించి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సుమారు 750 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు.గతంలో కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారుల విషయంలో రాజకీయ విమర్శలకంటే ప్రజల ప్రాణాలు, సంక్షేమమే ముఖ్యమని అన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సూచనలు ఇవ్వకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు.
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించిన ఘనత తమదేనని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా తెలంగాణకు వచ్చి సన్నవడ్లను క్వింటాల్‌కు సుమారు రూ.3,200 నుంచి రూ.3,400 వరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రెండో పంటగా వరి సాగు చేయకుండా, నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, గ్రామీణ ప్రాంతాలతోపాటు నగర ప్రజలు కూడా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని కోరారు. నీటి కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తే సహించం: బొబ్బిలి రామకృష్ణ
నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు దానిని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని అన్నారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ఉపయోగకరమైన సూచనలు ఇస్తే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే అనవసర విమర్శలు చేస్తే సహించబోమని పేర్కొన్నారు. నగర ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా నల్లాలను అవసరం లేనప్పుడు మూసివేయాలని కోరారు.
పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలి: తాహెర్ బిన్ హందాన్
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెల్లడించిన అంశాలను ప్రజలు గమనించాలని కోరారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, నగర మేయర్ ఉమారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణ, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కౌడప్ శరత్, గాదారి గోపి, రత్నాకర్ గౌడ్, జిల్లా కోశాధికారి భక్త వత్సలం, సీనియర్ నాయకుడు బాల నర్సయ్య, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు గంగారెడ్డి, ప్రవీణ్ గౌడ్, కార్పొరేటర్లు ఎర్రం గంగాధర్, అహ్మద్, రవి, గణేష్, రఘు, నరేందర్, కిషన్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు అపర్ణ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


