Breaking News

అమర వీరురాలు గాజుల సౌమ్యకు ఘన నివాళి

పోలీస్ అమరవీరుల సంస్మరణ జ్ఞాపికను కుటుంబ సభ్యులకు అందజేసిన డీపీఈవో నందగోపాల్

నిజామాబాద్, అక్టోబర్ 26 (E6tv న్యూస్).

విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణాలర్పించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ దివంగత కుమారి గాజుల సౌమ్యకు నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఘనంగా నివాళులర్పించింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన స్మారక జ్ఞాపికను ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కె.జి. నందగోపాల్ అందజేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నిజామాబాద్‌లోని డీపీఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది యూనిఫాంలో హాజరై సౌమ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా డీపీఈవో కె.జి. నందగోపాల్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో గాజుల సౌమ్య ప్రదర్శించిన తెగువ, చేసిన త్యాగం శాఖలోని ప్రతి ఒక్కరికీ నిరంతరం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. జిల్లాలో ఎక్సైజ్ నేరాలను సమూలంగా నిర్మూలించేందుకు అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయడమే అమరురాలికి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

అమరురాలు సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖతో పాటు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి సత్వర సహకారం అందించిన ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎక్సైజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వి. నర్సయ్య, ట్రైనీ ఏఈఎస్ గాయత్రి, ఎస్‌హెచ్‌ఓ సరిత, బోధన్ ఎస్‌హెచ్‌ఓ భాస్కర్ రావు, భీమ్‌గల్ ఎస్‌హెచ్‌ఓ చంద్రమోహన్, నిజామాబాద్ ఎస్‌ఐ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.హెచ్‌సీ, ఈసీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ. రవికుమార్, జోనల్ అధ్యక్షుడు పవార్ కైలాష్, జిల్లా అధ్యక్షుడు సునీల్ కుమార్, టీఎన్జీవోస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ కె. అరుణ్ కుమార్, కానిస్టేబుల్ యూనియన్ నాయకులు, కార్యాలయ సూపరింటెండెంట్, మినిస్టీరియల్ సిబ్బంది, జిల్లా ఎగ్జిక్యూటివ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అమరురాలికి నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *